– తలైవా ‘ఈగో’ స్టోరీపై ఆసక్తికర ట్వీట్!
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం, శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, తనలోని అహంకారం ఎలా తగ్గిందో వివరించారు.
గతంలో తాను ఓ ఆశ్రమానికి వెళ్లానని, అక్కడి వారు తనను గుర్తుపట్టి మీద పడతారని ఊహించానని రజనీకాంత్ చెప్పారు. కానీ ఎవరూ తన వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. స్టార్ డమ్ కంటే, ఆధ్యాత్మిక స్టార్ డమ్ గొప్పదనే విషయం తనకు ఆ క్షణంలో అర్థమయిందని తెలిపారు. అప్పుడే తనలోని అహం తొలగిపోయిందని చెప్పారు. కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ, ఆయన తన గురించి నిజాయితీగా చెప్పుకోవడం రజనీకాంత్ హుందాతనాన్ని తెలియజేసింది.
తలైవా ప్రసంగాన్ని విన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. రజనీకాంత్‌పై ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, దానిని తలకు ఎక్కించుకోకుండా వినయంగా ఉండటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. విజయం సాధించడమే కాకుండా, ఆ విజయంలో కూడా ఎలా ఒదిగి ఉండాలో చెప్పే మాటలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమంటూ కొనియాడారు.