– తొలి భారతీయుడిగా రికార్డు
– వంటకళ, కళాత్మక రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపు
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో భారతీయ చెఫ్ వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం దక్కింది. ఆసియాన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ మంథ్ సందర్భంగా ఆయన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
ఆల్బనీలో నిర్వహించిన కార్యక్రమంలో వికాస్ ఖన్నాకు న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ ప్రత్యేక ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వికాస్ ఖన్నా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, ఆహార సంప్రదాయాలను ప్రపంచానికి చెరవేయడం తన లక్ష్యమని తెలిపారు. న్యూయార్క్ రాష్ట్ర చరిత్రలో ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడిగా నిలవడం మరింత ప్రత్యేకంగా ఉందని చెప్పారు. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న సమాజంగా ఏఏపీఐ కమ్యూనిటీ నిలుస్తోందని పేర్కొన్నారు. 25 మిలియన్లకు పైగా ప్రజలు, విభిన్న సంస్కృతులు అలాగే ఆశయాలకు ఈ కమ్యూనిటీ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ గౌరవం కేవలం తన వ్యక్తిగత విజయమే కాకుండా ఆశ, గుర్తింపు, ప్రాతినిధ్యం, వైవిధ్య శక్తికి నిదర్శనమని వెల్లడించారు.